కరోనాపై పోరుకు రూ.15 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

నోవల్ కరోనా వైరస్‌పై పోరాటానికి కేంద్రం రూ.15000 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఇందులో రూ.7774 కోట్లను తక్షణమే కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ కోసం ఉపయోగిస్తారు. మిగతా మొత్తాన్ని 1-4 ఏళ్లలో మీడియం టర్మ్ సపోర్ట్‌గా ఉపయోగిస్తారు. కరోనాను అరికట్టడం, టెస్టింగ్ సామర్థ్యం పెంచడం, కోవిడ్-19 చికిత్స సదుపాయాలను మెరుగపర్చడం, వైద్య పరికరాలు, ఔషధాల కొనుగోలు కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు.


కోవిడ్-19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్ ప్రిపేర్డ్‌నెస్ ప్యాకేజీ అని పిలిచే దీన్ని మూడు దశల్లో అమలు చేస్తారు. ఈ నిధులను రాష్ట్రాలు, కేంద్రం పాలిత ప్రాంతాల మధ్య విభజిస్తారు. కోవిడ్-19 హాస్పిటళ్ల ఏర్పాటు, మెడికల్ సెంటర్లలోని ఐసీయూలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఈ నిధులను వాడతారు.

భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులు విజృంభిస్తే ఎదుర్కోవడానికి వీలుగా జాతీయ, రాష్ట్రాల హెల్త్ సిస్టమ్‌ల‌ను బలోపేతం చేయడం కోసం కూడా ఈ నిధులను ఉపయోగిస్తారు. లేబరేటరీల ఏర్పాటు, బయో సెక్యూరిటీ సన్నద్ధత, రిస్క్ కమ్యూనికేషన్ యాక్టివిటీలను నిర్వహించడం కోసం ఈ నిధులను వాడతారు.

కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో పేదలను ఆదుకోవడం కోసం రూ.1.7 లక్షల కోట్ల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించింది. వైద్య సిబ్బందికి బీమా సదుపాయాన్ని కూడా కేంద్రం ప్రకటించింది. దేశంలోని 80 కోట్ల మంది పేదలకు ఉచిత బియ్యం లేదా గోధుమలను అందించడంతోపాటు అర్హులకు వంట గ్యాస్‌ను ఉచితంగా అందిస్తారు. బ్యాంకు ఖాతాల్లో నగదును జమ చేస్తారు.